ఇన్ఫోసిస్‌ అధినేత రాజీనామా | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ అధినేత రాజీనామా

Published Fri, Jan 12 2018 5:19 PM

Infosys president Rajesh Murthy resigns  - Sakshi

బెంగళూరు : టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో అధినేత షాకిచ్చారు. ముగ్గురు అధినేతల్లో ఒకరైన రాజేష్‌ మూర్తి, కంపెనీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్ఫోసిస్‌ ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సలీల్‌ పరేఖ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీనామా చేసిన తొలి ఎగ్జిక్యూటివ్‌ ఈయనే. పరేఖ్‌ రాకతో మేనేజ్‌మెంట్‌లో రాజీనామాల పర్వం తగ్గుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేశారు. కానీ కంపెనీలో రాజీనామాలు మాత్రం ఆగడం లేదు. విశాల్‌ సిక్కా రాజీనామా, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలకు కంపెనీ మేనేజ్‌మెంట్‌లో స్థిరత్వం పొందాల్సి ఉందని ప్రస్తుతం విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే మూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేస్తున్నట్టు తెలిసింది. 26 ఏళ్లుగా ఆయన ఇన్ఫీలో పనిచేస్తున్నారు. జనవరి చివరి వరకు మాత్రమే మూర్తి ఇక ఇన్ఫీలో పనిచేయనున్నారు. గత 26 ఏళ్లుగా ఇన్ఫోసిస్‌ అందించిన సేవలకు గాను, కంపెనీ ఆయనను ప్రశంసించింది. భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. గత జూన్‌లో నలుగురు ఇన్ఫోసిస్‌ అధినేతల్లో ఒకరైన సందీప్‌ దాడ్లాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన అనంతరం ప్రస్తుతం మూర్తి కూడా కంపెనీ నుంచి తప్పుకోబోతున్నట్టు తెలిపారు.  2016లో మూర్తి కంపెనీ అధినేతగా ప్రమోట్‌ అయ్యారు. ఎనర్జీ, యుటిలిటీస్‌, టెలికమ్యూనికేషన్స్‌, సర్వీసెస్‌కు మూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్ఫోసిస్‌ కన్సల్టింగ్‌, యూరప్‌ వ్యాపారాలకు కూడా మూర్తినే అధినేత. 

Advertisement
Advertisement